09 July 2011

తెలంగాణపై ఎటూ తేల్చని జగన్ పార్టీ

Check out తెలంగాణపై ఎటూ తేల్చని జగన్ పార్టీ

మొత్తానికి వై.స్. జగన్ తెలంగాణపై అస్పష్టంగానే ఐనా నోరు విప్పారు. తెలంగాణా ప్రజల పోరాటాన్ని ఒప్పుకుంటూనే తమ వాదన సమైఖ్యమేనని తేల్చి చెప్పారు. ఇక్కడ కూడా ఎవరికీ చిక్కకుండా జగన్ తనదైన తెలివి ప్రదర్శించారు. ఇరు ప్రాంతాల ప్రజల అభిమానాన్ని పొందేందుకే నిర్ణయించుకున్నా, తెలంగాణాలో జగన్ తీరును ఎలా స్వీకరిస్తారో చూడాలి.  తెలంగాణపై కొద్దో గొప్పో తెలుగుదేశం పార్టీలో వచ్చిన స్పష్టత జగన్ పార్టీలో కనిపించలేదు. ఇప్పటి వరకు జగన్ కు లోపాయికారీ సహకారం అందిస్తూ వచ్చిన తెరాస ఇక ఎలా స్పందిస్తుందో మరి. జగన్ ప్రకటన వెలువడి ఇప్పటికి  కొన్ని గంటలు దాటినా తెరాస శ్రేణులు ఇంకా తెలుగుదేశం పార్టీ పైనే విమర్శలు కొనసాగిస్తుండడం గమనార్హం. ఇప్పటి వరకు జగన్ తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఇక భవిష్యత్తులో జగన్ తెలంగాణాలో చేసే పర్యటనలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.రెండు రోజుల పాటు జరిగిన జగన్ పార్టీ ప్లీనరీ ద్వారా త్రిశంకు స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకే  కాస్త మెరుగులు దిద్దుతూ తమ మేనిఫెస్టో ప్రకటించారు. పించన్ల మొత్తాలను పెంచి, ఇళ్ళ నిర్మాణాల సంఖ్యను పెంచేశారు. ఇక వై.స్.రాజశేఖరరెడ్డి కి పేరు తెచ్చిన 108 వాహనాల సంఖ్యనూ పెంచేశారు. పనిలో పనిగా కేంద్రంలో వ్యవసాయ మంత్రి పదవి మన రాష్ట్రానికే దక్కాలని చెబుతూ పరోక్షంగా తాను రైతు పక్షపాతినన్న విషయాన్నీ చెప్పుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే జగన్ పార్టీ విధానాలు రాష్ట్ర ప్రగతికి ప్రయోజనాలు కలిగించేవి కాకపోగా మరోసారి సంక్షేమ పథకాలతో ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పథకాలతో సాధించే ప్రయోజనం ఏమిటో ప్రధాన పార్టీలు ఇంకా గుర్తించక పోవడం విచారించదగ్గ విషయం.రైతులపై అంతా ప్రేమ ఉండే వారయితే సరైన విధానాలను రూపొందించే వారే. కేవలం వోటు రాజకీయాలతో గట్టేక్కుదామన్న స్వార్ధం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పార్టీలు ఎన్ని వచ్చిన ప్రజల ఆశలకు తగ్గ రీతిలో పని చేస్తాయని ఆశించడం అత్యాశే.

No comments:

Post a Comment