హైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన... శుక్రవారం రాత్రి 11.05 గంటల సమయంలో, గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు. హాస్యరసంతో నవ్వించి నవ్వించి కన్నీళ్లు తెప్పించే ఆయన... తన అభిమానులకు విషాదం మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఇప్పటిదాకా 49 సినిమాలకు దర్శకత్వం వహించారు. తన 50 సినిమా 'బురిడీ' చిత్రీకణలో ఉండగానే కన్ను మూశారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన రెండు మూడేళ్ల క్రితం ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వైద్య చికిత్సతో కోలుకున్నారు. అప్పట్లో తన ప్రాణాలు నిలవడం అద్భుతమని ఈవీవీ పలు సందర్భాల్లో చెప్పారు కూడా! అయినప్పటికీ... సిగరెట్లు తాగే అలవాటు మానుకోలేకపోయానని కూడా ఆయన తెలిపారు. ఇటీవల కత్తి కాంతారావు సినిమా చిత్రీకరణ సమయంలో వ్యాధి తిరగ దోడింది. కొన్నాళ్ల క్రితం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం గుండెపోటు రావడంతో ఈవీవీ కన్ను మూసినట్లు సినిమా వర్గాలు తెలిపాయి. ఈవీవీకి భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేశ్, 'అల్లరి' నరేశ్ ఉన్నారు. కుమారులు ఇద్దరూ సినిమా హీరోలుగా స్థిరపడ్డారు.
హాస్య చిత్రాల రాజు
పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన ఈవీవీ పూర్తిపేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఆయన 1958 జూన్ 10న జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. జంధ్యాల వద్ద శిష్యరికం చేశారు. గురువు మార్గంలోనే ప్రయాణిస్తూ.... అద్భుతమైన హాస్య చిత్రాలను అందించారు. ఈవీవీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'చెవిలో పువ్వు'. ఇది 1990లో విడుదలైంది. ప్రేమ ఖైదీతో ఆయన సూపర్ హిట్ కొట్టారు.
అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకిడి పంబ, తొట్టిగ్యాంగ్, ఎవడి గోల వాడిది, బెండు అప్పారావు వంటి అనేక హాస్య చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆమె, ఆయనకు ఇద్దరు వంటి సెంటిమెంట్ ప్రధాన సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్రరంగంలోని దాదాపు అందరు అగ్రహీరోలతో సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. చిరంజీవితో అల్లుడా మజాకా, నాగార్జున కథానాయకుడిగా వారసుడు, ఆవిడా మా ఆవిడే, హలో బ్రదర్, వెంకటేశ్‌తో సూర్యవంశం సినిమాలు తీశారు.
'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' చిత్రంతో పవన్ కల్యాణ్‌ను వెండితెరకు పరిచయం చేశారు. రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, వినోద్ కుమార్లతోపాటు తన ఇద్దరు కుమారులతో అనేక సినిమాలు తీశారు. హిందీలో అమితాబ్‌తో తీసిన 'సూర్యవంశ్' చిత్రానికి కూడా ఈవీవీయే దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'కత్తి కాంతారావు'. 'బురిడీ' అనే సినిమా నిర్మాణంలో ఉంది. కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గానూ ఈవీవీ తన ప్రతిభ చాటుకున్నారు
. హలో బ్రదర్, మావిడాకులు, జంబలకిడి పంబ, 420, అప్పుల అప్పారావు, ఆలీబాబా అర డజను దొంగలు తదితర చిత్రాలకు కథ అందించింది ఆయనే. దర్శకుడు కాకముందు... హైహై నాయకా, ఇంద్రుడు చంద్రుడు, అహ నా పెళ్లంట, నాలుగు స్తంభాలాట చిత్రాలకు ఈవీవీ అసోసియేట్ దర్శకుడిగా పని చేశారు. 2000లో 'చాలా బాగుంది' అనే సినిమా ద్వారా నిర్మాతగా కూడా మారారు. రెండు రెళ్లు ఆరు, రెండు జళ్ల సీత సినిమాలకు కూడా ఆయన పని చేశారు. ఈవీవీ 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు. 'ఆమె' సినిమాకు నంది అవార్డు అందుకున్నారు.
ప్రముఖుల సంతాపం
ఈవీవీ ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. ఈ వార్త తెలియగానే అనేక మంది సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి వచ్చి ఆయనకు నివాళులర్పించారు. ఈవీవీ కుమారులు ఆర్యన్ రాజేశ్, నరేశ్‌లను పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో దర్శకులు కోడి రామకృష్ణ, శంకర్, నిర్మాతలు దగ్గుబాటి సురేష్, సి.కల్యాణ్, హరినాథ్లతోపాటు రాణా, జీవిత, రాజశేఖర్, అశోక్, కోటి, శివారెడ్డి, ఎంపీ లగడపాటి తదితరులు ఉన్నారు. అలీ, ఉత్తేజ్ కంట నీరు పెట్టుకున్నారు.
No comments:
Post a Comment