హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్సార్ ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావుపై వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ రాసిన బహిరంగ లేఖ కలకలం సృష్టించింది. ఊహించని విధంగా ఈ లేఖాస్త్రాన్ని ఆమె సంధించారు. కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్ కు దూరమై చాలా కాలమే అవుతోంది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించవద్దని పలు మార్లు కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినా వైయస్ జగన్ వినలేదని చెబుతారు. తమ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కెవిపిపై వైయస్ జగన్ ఏ విధమైన విమర్శలు చేయరని భావించారు. అయితే, అందుకు విరుద్ధంగా కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ బహిరంగ లేఖ వెనక వైయస్ జగన్ హస్తం ఉందనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.
వైయస్సార్ అభిమానం గల చాలా మంది శాసనసభ్యులు తన వైపు రాకుండా కెవిపి రామచందర్ రావే అడ్డుపడుతున్నారని వైయస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కెవిపి కాంగ్రెసుతో లేకుంటే ఇంకా కొంత మంది శాసనసభ్యులు తన వైపు వస్తారని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పలువురు కాంగ్రెసు నాయకులు కూడా కెవిపి మాట వల్లనే తన వైపు రావడం లేదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యూహరచనలో కెవిపిని దిట్టగా భావిస్తారు. ఆ వ్యూహరచనా చతురతను కాంగ్రెసు అధిష్టానం వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. దానివల్లనే వైయస్ జగన్ వ్యూహాలు అంతగా ఫలితాలు ఇవ్వడం లేదని అంటున్నారు.
దానికితోడు, వైయస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెసు సీనియర్ నేతలు జగన్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్సార్ అధికారాన్ని వాడుకుని వైయస్ జగన్ కోట్లకు పడగలెత్తారనే ఆరోపణ వారి నుంచి వస్తోంది. ఆ ఆరోపణలను కెవిపి వైపు మళ్లించాలనేది కూడా జగన్ వ్యూహం కావచ్చునని అంటున్నారు. వైయస్సార్ ను కెవిపి పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పడమే జగన్ వర్గం వ్యూహంగా చెబుతున్నారు. పైగా, కెవిపినే వదిలిపెట్టలేదంటే, కాంగ్రెసుతో ఉండే ఎవరినీ కూడా వదిలిపెట్టబోమని హెచ్చరికలాంటిది చేయడం కూడా జగన్ వర్గం ఆలోచనగా చెబుతున్నారు. అవసరమైతే, వైయస్ వివేకానంద రెడ్డిపై కూడా విరుచుకుపడ్డానికి వెనకాడమని ముందే హెచ్చరిస్తున్నట్లు భావించవచ్చు
No comments:
Post a Comment